దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సామూహిక దశలోకి ప్రవేశించిందని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా.. దీనిని ఇప్పుడే ఎత్తివేయడానికి కేంద్రం సముఖం లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. బుధవారం విపక్ష సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని, అందుకే కఠిన నిర్ణయాలు తీసుకున్నామని మోదీ పునరుద్ఘాటించారు. వైరస్ వేగాన్ని నియంత్రించి, ప్రజలను కాపాడటమే ప్రభుత్వం ముందున్న ప్రస్తుత లక్ష్యం. అలాగే, పలు రాష్ట్రాలు సైతం లాక్‌డౌన్ కొనసాగించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగింపునకే మోదీ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 8 రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు సగటున 500 వరకు నమోదవుతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా మరో 600పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనూ కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ఒక్క ఆ రాష్ట్రంలోనే కేసుల సంఖ్య 1,100 దాటింది. బుధవారం మరో 115 కేసులు నమోదు కావడంతో మొత్తం 1,135 మంది వైరస్ బారినపడ్డారు. గడచిన 24 గంటల్లో మహమ్మారి కారణంగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,916 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. 180 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 565 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉంది. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 49 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు ఏపీలో 348, తెలంగాణలో 453కి చేరుకున్నాయి. ఏపీలో 9 మంది, తెలంగాణలో 43 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. అలాగే రెండు రాష్ట్రాల్లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కొత్తగా మరో 49 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 453కు పెరిగింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి 11 మంది మృతిచెందగా.. 45 మంది పూర్తిగా కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 397 మంది చికిత్స పొందుతున్నారు.