చైనాలో వ్యాపిస్తున్న కొత్త వైరస్ కరోనా వైరస్‌ల కుటుంబానికి చెందినది. గతంలో ఈ వైరస్‌లు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) అనే శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యాయి. అప్పట్లో సార్స్ బాధితుల్లో 9 శాతం మంది, మెర్స్ బాధితుల్లో ఇంచుమించు 35 శాతం మంది చనిపోయారు.
సార్స్, మార్స్‌లకు కారణమైన కరోనా వైరస్‌లూ, ఇప్పుడు చైనాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ జంతువుల నుంచి వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.
చైనాలో వ్యాపిస్తున్న వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రస్తుతానికి నావెల్ కరోనా వైరస్(2019-ఎన్‌సీవోవీ) అని వ్యవహరిస్తోంది.
చాలా జంతువులు ప్రమాదకరమైన వైరస్‌లకు వాహకాలు. అదృష్టవశాత్తూ ఆ వైరస్‌లు సాధారణంగా మనుషులకు పాకవు.
అత్యధిక సందర్భాల్లో ఒక జీవజాతి నుంచి మరో జీవజాతికి వైరస్‌లు, వ్యాధులు సంక్రమించకుండా చేసే సహజమైన వ్యవస్థ(ద స్పీసీస్ బారియర్) వల్ల జంతువుల నుంచి మనుషులకు వైరస్‌లు వ్యాపించలేవని బ్రిటన్లోని వార్‌విక్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రాల విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ ఈస్టన్ బీబీసీతో చెప్పారు.